కొల్లాపూర్: కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో ఇటీవల మృతిచెందిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తండ్రి బీరం లక్ష్మారెడ్డి దశదినకర్మ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై నివాళులర్పించారు. లక్ష్మారెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం కేటీఆర్ పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడి పంటల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 40 శాతానికి పైగా పంటలు దెబ్బతిన్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
పంట నష్టంపై ప్రభుత్వం వెంటనే సమగ్ర సర్వే నిర్వహించి, ప్రతి రైతుకు జరిగిన నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు తగిన పరిహారం అందించడంతో పాటు పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, విత్తనాలు, ఎరువులు, సాగు పెట్టుబడుల విషయంలో ప్రత్యేక సహాయం అందించాలని కోరారు.
క్షేత్రస్థాయిలో నిర్వహించే పంట నష్టం సర్వే పారదర్శకంగా ఉండాలని, వాస్తవంగా నష్టపోయిన ప్రతి రైతును గుర్తించి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు అప్పులు చేసి సాగు చేసిన పంటలు చేతికందక ఇబ్బందులు పడుతున్నందున ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే వారి తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, సి. లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, విజయుడు, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


