తొలి కిరణం, సెప్టెంబర్ 26, ఘట్కేసర్ ప్రతినిధి: మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యంనంపేట బ్రిడ్జిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో బీటెక్ విద్యార్థి కిషోర్ (20) మృతి చెందగా, అతనితో ప్రయాణిస్తున్న విజయ అనే యువతి తీవ్రంగా గాయపడింది.
నాగర్‌కర్నూల్ జిల్లా తిప్పారెడ్డిపల్లికి చెందిన కిషోర్ బీఎన్ రెడ్డినగర్‌లో నివాసముంటూ ఇబ్రహీంపట్నంలోని సెయింట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
శనివారం ఉదయం తన బంధువు విజయను పరీక్ష రాయించేందుకు యంనంపేటలోని శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలకు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా యంనంపేట బ్రిడ్జిపై ఆర్టీసీ బస్సు వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిషోర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విజయను చికిత్స నిమిత్తం మేడిపల్లిలోని శ్రీకర ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కిషోర్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


