శ్రీరంగాపురం, సెప్టెంబర్ 25 – తొలి కిరణం:
వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల కేంద్రంలోని శ్రీరంగనాయక స్వామి ఆలయంలో శ్రీరాముడు, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి విగ్రహాలు చోరీకి గురయ్యాయి. గుర్తుతెలియని దుండగులు మూడు విగ్రహాలను ఎత్తుకెళ్లిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకులు ప్రధాన ద్వారం తాళం తీసి లోపలికి వెళ్లగా, రెండో ద్వారం వద్ద ఉన్న జాలి వెనుక భాగంలో అనుమానాస్పద పరిస్థితులు కనిపించాయి. సాధారణంగా పది రౌండ్లు తిప్పితేనే తెరుచుకునే తాళానికి సంబంధించిన జాలి విప్పి ఉండటంతో అర్చకులకు అనుమానం కలిగింది. దీంతో విగ్రహాలు భద్రపరిచిన గదిని పరిశీలించగా శ్రీరాముడు, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి విగ్రహాలు కనిపించలేదు.
వెంటనే అర్చకులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఆలయానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. చోరీ జరిగిన తీరును పరిశీలిస్తూ ఆధారాల సేకరణ చేపట్టారు.
సమాచారం అందుకున్న వనపర్తి జిల్లా ఎస్పీ సునీతారెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఆలయాన్ని సందర్శించి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆలయ అర్చకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? వాటిలో ఏమైనా దృశ్యాలు నమోదయ్యాయా? అనే అంశాలపై పోలీసు అధికారులను ఆరా తీశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



