తెలకపల్లి: విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ప్రభుత్వ పాఠశాల.. వర్షం పడితే మాత్రం వరదనీటితో నిండిపోతోంది. తెలకపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిన్నపాటి వర్షానికే పాఠశాల ప్రాంగణం జలమయంగా మారడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మైదానం మొత్తం బురదమయంగా మారడంతో విద్యార్థులు నడవడానికి, ఆటలు ఆడేందుకు ఇబ్బందులు పడుతున్నారని పాఠశాల వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు పాఠశాలలో తరగతి గదుల కొరత తీవ్రంగా ఉందని తెలుస్తోంది. పాటిషన్లతో ఒకే గదిలో రెండు తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొందని పాఠశాల వర్గాలు పేర్కొంటున్నాయి. సైకిల్ స్టాండ్, వంట సామగ్రి కోసం ఉపయోగించే గదిలోనే ఆరో తరగతి విద్యార్థులకు బోధన జరుగుతున్న పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చదివించాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో.. పాఠశాలలో కనీస మౌలిక వసతుల కొరతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు అదనపు తరగతి గదులు, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. అధికారులు పాఠశాలను పరిశీలించి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



