పాలెం, సెప్టెంబర్ 23: జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం ఆయుర్వేదంపై అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ ఎం. ప్రియాంక మాట్లాడుతూ ఆయుర్వేదం కేవలం వ్యాధుల చికిత్సకే పరిమితం కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రస్తుత వేగవంతమైన జీవన విధానంలో ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయుర్వేదం, యోగా, ధ్యానం వంటి పద్ధతులను నిత్యజీవితంలో భాగం చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని వివరించారు.
హోమియోపతి వైద్యులు డాక్టర్ సాయిరాం గౌడ్ మాట్లాడుతూ ఆయుర్వేదంలో సూచించిన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమబద్ధమైన జీవన విధానం, యోగా, ప్రాణాయామాన్ని ప్రజలు దైనందిన జీవితంలో పాటించాలని సూచించారు. ఆయుర్వేదం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉపయోగపడే ప్రాచీన వైద్య విధానమని, శరీరం–మనస్సు మధ్య సమతుల్యతను కాపాడుకోవడం దాని ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సంప్రదాయ వైద్య విజ్ఞానాన్ని ఆధునిక ఆరోగ్య అవగాహనతో సమన్వయం చేసుకుంటూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


