తొలికిరణం, సెప్టెంబర్ 23, ఘట్కేసర్ ప్రతినిధి: మేడ్చల్–మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని అన్నోజిగూడలో దిల్బహార్ మసాలా కంపెనీపై ఎస్ఓటీ, పోచారం ఐటీ కారిడార్ పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో చేపట్టిన తనిఖీల్లో గడువు ముగిసిన మసాలా ఉత్పత్తులు భారీగా బయటపడ్డాయి. దిల్బహార్ మటన్ బిర్యానీ, చికెన్, మీట్, ఫిష్, తందూరి చికెన్, సాంబార్, సబ్జీ, డ్రై మ్యాంగో తదితర మసాలా ప్యాకెట్లు గడువు దాటినప్పటికీ మార్కెట్కు తరలించేందుకు సిద్ధంగా ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 2,000కు పైగా ఎక్స్పైరీ మసాలా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై ఫుడ్ సేఫ్టీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


