పాలెం, సెప్టెంబర్ 23: జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని పాలెంలోని తోటపల్లి సుబ్రహ్మణ్యం మెమోరియల్ హైస్కూల్ విద్యార్థినీ, విద్యార్థులతో బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. హోమియో వైద్యాధికారి డాక్టర్ సాయిరాం గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఆయుర్వేదం ప్రాముఖ్యత, ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సాయిరాం గౌడ్ మాట్లాడుతూ ఆయుర్వేదం కేవలం వైద్య విధానం మాత్రమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఉపయోగపడే ప్రాచీన జీవన విధానమని తెలిపారు. శరీరం, మనస్సు మధ్య సమతుల్యతను కాపాడుకోవడం ఆయుర్వేదం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే వ్యాధులు రాకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమన్నారు. సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమబద్ధమైన వ్యాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. చిన్న వయస్సు నుంచే విద్యార్థులు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పరిశుభ్రత, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవాలని కోరారు.
ఆయుర్వేదంలో పేర్కొన్న వాత, పిత్త, కఫ దోషాల సమతుల్యత ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యమైన అంశంగా భావించబడుతుందని వివరించారు. యోగ, ధ్యానం వంటి పద్ధతులు మానసిక ప్రశాంతతకు దోహదపడతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రాచీన వైద్య సంప్రదాయాల ప్రాముఖ్యతను తెలుసుకొని ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, ఎస్ఎన్ఓ మాధవస్వామి తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



