రాజంపేట, సెప్టెంబర్ 22 (తొలి కిరణం):
కడప జిల్లా ఒంటిమిట్టలో కొలువుదీరిన శ్రీ కోదండరామస్వామివారి సన్నిధి నిత్యం భక్తజన సందోహంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటోంది. స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్య అన్నప్రసాద వితరణ కొనసాగుతోంది. శ్రీరాముని సన్నిధిలో భక్తులకు అన్నప్రసాదం అందించడం మహత్తరమైన పుణ్యకార్యమని ఆలయ అధికారులు తెలిపారు.
నిత్య అన్నదాన కార్యక్రమంలో భక్తులు కూడా భాగస్వాములు కావాలని ఆలయ ఈవో పిలుపునిచ్చారు. భక్తులు అందించే విరాళాలతో అన్నప్రసాద వితరణను మరింత నిరంతరంగా కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
రూ.516 విరాళం అందించే దాతల పేరుతో ఒకరోజు అన్నప్రసాద వితరణ నిర్వహిస్తారు. రూ.1,016 విరాళం అందించే వారి పేరుతో ఒకరోజు ప్రత్యేక భోజనంతో పాటు స్వీట్‌ను ఏర్పాటు చేస్తారు. రూ.5,016 విరాళం అందించే దాతల పేరుతో ప్రతి సంవత్సరం నిర్ణీత రోజున శాశ్వతంగా అన్నప్రసాద వితరణ నిర్వహించే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు.
శ్రీ కోదండరామస్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు పవిత్ర అన్నదాన కార్యక్రమంలో తమ వంతు సహకారం అందించి స్వామివారి సేవలో భాగస్వాములు కావాలని అధికారులు కోరారు. భక్తులు సమర్పించే ప్రతి విరాళం ద్వారా మరింత మంది భక్తులకు అన్నప్రసాదం అందించే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
శ్రీరాముని కృపాకటాక్షాలతో భక్తుల కుటుంబాల్లో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పెద్ద మొత్తంలో విరాళాలు అందించదలచిన దాతలు ఆలయ కార్యాలయంలో అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


