లింగసానిపల్లి: గ్రామ పరిశుభ్రత, అభివృద్ధి కోసం నిరంతరం సేవలందిస్తున్న పంచాయతీ సిబ్బంది సంక్షేమానికి లింగసానిపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగా ఐదుగురు పంచాయతీ సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించింది.
గ్రామ సర్పంచ్ పిట్టల చంద్రకళ శ్రీరాములు, ఉప సర్పంచ్ చెంచటి సత్యనారాయణ, గ్రామ కార్యదర్శి ప్రసన్న పర్యవేక్షణలో బీమా ప్రక్రియను పూర్తి చేసి సిబ్బందికి బీమా పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాన్ని పరిశుభ్రంగా, సుందరంగా ఉంచడంలో పంచాయతీ సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని అన్నారు. రాత్రింబవళ్లు కష్టపడే సిబ్బంది రక్షణతో పాటు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు.
ఉప సర్పంచ్, కార్యదర్శి మాట్లాడుతూ.. సిబ్బంది సంక్షేమానికి ఇలాంటి బీమా సౌకర్యం కల్పించడం అభినందనీయమన్నారు. ఈ నిర్ణయం సిబ్బందికి మరింత ధైర్యంతో విధులు నిర్వహించేలా ప్రోత్సాహాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.
రూ.15 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించిన సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శి, పాలకవర్గానికి పంచాయతీ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయం పట్ల గ్రామ ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్‌లు (Tags):


