బిజినపల్లి, సెప్టెంబర్ 22 (తొలి కిరణం ప్రతినిధి):
బిజినపల్లి మండల కేంద్రంలోని యాదవుల ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ పునర్నిర్మాణ, అభివృద్ధి పనులకు ఆదివారం ఘనంగా శ్రీకారం చుట్టారు. నాగర్కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆలయ అభివృద్ధి పనులను లాంఛనంగా ప్రారంభించారు.
ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు యాదవ సంఘం, ఆలయ కమిటీ సభ్యులు డోలు డప్పులు, మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనుల కోసం తీసుకువచ్చిన మొరం వాహనాలకు ప్రత్యేక పూజలు చేసి, కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఆలయ నిర్మాణ ప్రణాళిక, పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ బిజినపల్లి చౌడేశ్వరి ఆలయానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు. యాదవ సోదరుల ఆరాధ్య దైవమైన చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు మంజూరు చేయించి ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో బిజినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిద్దె రాములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగనమోని తిరుపతయ్య, కత్తె ఈశ్వర్, డిప్యూటీ మహేష్ యాదవ్, కేటీ తిరుపతయ్య, మాజీ ఎంపీపీ ఎద్దుల రాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాజీర్, పండ్ల పాషా, ముక్తార్, చౌడేశ్వరి ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు, యాదవ కుల పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


