తెల్కపల్లి, సెప్టెంబర్ 21 (తొలి కిరణం): తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ, నాగర్‌కర్నూల్ జిల్లా, తెల్కపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్‌సీడ్స్ (NMEO-OS) పథకం కింద ఉచిత వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం తెల్కపల్లిలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రైతులకు ఉచిత వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ద్యాసాని భాస్కర్ రెడ్డి అధ్యక్షత వహించారు. మార్కెట్, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పర్వతాలు, మండల రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, PACS వైస్ చైర్మన్ యాదయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి నర్మద రైతులకు వేరుశనగ విత్తనాల వినియోగం, సాగు విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ శాఖ సూచనలను పాటిస్తూ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ నూనెగింజల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలను వినియోగించి శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయడం ద్వారా మెరుగైన దిగుబడులు సాధించాలని రైతులకు తెలిపారు.
రైతుల సంక్షేమానికి PACS సేవలు
తెల్కపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రైతుల సంక్షేమం కోసం విత్తనాలు, ఎరువులు, రుణాలు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు తదితర సేవలను అందిస్తూ నిరంతరం సహకరిస్తోందని నిర్వాహకులు తెలిపారు. అలాగే VCC ద్వారా రైతులను ఒక వేదికపైకి తీసుకువచ్చి వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు, విలువ ఆధారిత సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో రైతులు, సంఘ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, రైతు ఉత్పత్తిదారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, గ్రామ సర్పంచులు, పత్రికా విలేకరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ తెల్కపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.


