బిజినేపల్లి, సెప్టెంబర్ 19: రైతులు కేవలం పంటల ఉత్పత్తిపైనే కాకుండా పంటల నాణ్యత, నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సూచించారు. శనివారం బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం, కేవీకే, వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళాను రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు ఏవీఎన్ రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడంతో పాటు రైతులు సమూహాలుగా ఏర్పడి ఉత్పత్తులను సమర్థవంతంగా మార్కెటింగ్ చేసుకోవాలని సూచించారు. పంటలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సాంకేతిక సలహాలను రైతులు వినియోగించుకోవాలని సూచించారు. పంటల సాగుకు ముందుగానే మార్కెట్ పరిస్థితులు, సాగు పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని, పంటల మార్పిడి విధానాన్ని పాటించాలని రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు ఏవీఎన్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖల అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.


