రైల్వేకోడూరు, సెప్టెంబర్ 19: తిరుపతి జిల్లా రైల్వేకోడూరులో 2026–27 నూతన ఎక్సైజ్ పాలసీపై మద్యం లైసెన్సుదారులతో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ జయరాజ్ శనివారం ఉదయం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన విధివిధానాలు, నిబంధనలను లైసెన్సుదారులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా మద్యం దుకాణాల లైసెన్సుదారులందరూ ప్రభుత్వం నిర్ణయించిన రుసుమును చెల్లించి తమ లైసెన్సులను రెన్యువల్ చేసుకోవాలని కమిషనర్ సూచించారు. మద్యం విక్రయాల్లో పారదర్శకత పాటించాలని, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా దుకాణాలను నిర్వహించాలని తెలిపారు. అలాగే నిర్ణీత సమయాల్లోనే మద్యం దుకాణాలను నిర్వహిస్తూ ఎక్సైజ్ శాఖ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సమావేశంలో రైల్వేకోడూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ టి.కె. తులసి, ఎస్ఐలు అఫ్జల్ ఖాన్, వరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


