బిజినపల్లి, సెప్టెంబర్ 19: బిజినపల్లి గ్రామంలోని సంతోష్‌నగర్ కాలనీలో శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నిమజ్జన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యూత్ సభ్యులు వినాయక విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన ఎద్దుల బండిపై ప్రతిష్ఠించి, డోలు వాయిద్యాలు, భజనల నడుమ గ్రామ వీధుల్లో ఘనంగా ఊరేగించారు. భక్తులు బొడ్డెమ్మలు, కోలాటాలతో సందడి చేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనం నిర్వహించారు.
ఈ సందర్భంగా విజన్ ఆంధ్ర రిపోర్టర్ శ్రీకృష్ణ యూత్ కమిటీ సభ్యులను పలకరించగా, వారు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా పురాతన పద్ధతిలోనే వినాయక నిమజ్జన వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధిక శబ్దంతో కూడిన డీజే కార్యక్రమాల వల్ల అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉన్నందున, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎద్దుల బండి, డోలు వాయిద్యాలు, భజనలతో శాంతియుతంగా వేడుకలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
మరుగునపడుతున్న మన పూర్వీకుల సంప్రదాయాలను నేటి తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధానాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. తమ ప్రయత్నానికి గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పురాతన సంప్రదాయాలను కాపాడుతూ వినాయక నిమజ్జనాన్ని నిర్వహించిన శ్రీకృష్ణ యూత్ సభ్యులను గ్రామ ప్రజలు అభినందించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


