నాగర్కర్నూల్, సెప్టెంబర్ 18: వినాయక చవితి సందర్భంగా నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని రెయిన్బో ప్రీ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై వినూత్న అవగాహన కల్పించారు. పర్యావరణానికి హాని కలిగించని మట్టి గణపతులను విద్యార్థులు స్వయంగా తయారు చేసి తమ సృజనాత్మక ప్రతిభను చాటుకున్నారు.
వివిధ ఆకృతుల్లో మట్టితో గణేశ విగ్రహాలను తయారు చేస్తూ విద్యార్థులు తమ కళాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వినాయక చవితి అంటే కేవలం మార్కెట్లో విగ్రహాన్ని కొనుగోలు చేసి పూజించడం మాత్రమే కాదని, మన చేతులతోనే మట్టి గణపతులను తయారు చేసుకుని పూజించవచ్చని వారు సందేశమిచ్చారు.
మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోవడంతో జల వనరులకు, జలచరాలకు హాని తక్కువగా ఉంటుందని విద్యార్థులు వివరించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి గణపతులను పూజించాలని వారు ప్రజలకు సూచించారు.
విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శిరీష, కరస్పాండెంట్ శ్రీరంగం సత్యనారాయణాచార్యులు, కళ్యాణి, అర్చన, జయంతి, అనుష, సుజాత, శిరీష, నవిత, శివలీల, జబీనా, ప్రసన్న, మంజుల, పరుశురాం తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


