హైదరాబాద్, సెప్టెంబర్ 17: నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి అభివృద్ధి ఫలాలు అందించి, ప్రపంచం గర్వించే తెలంగాణను నిర్మించుకుందామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణను నిర్మించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు.
సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజని, ఈ సందర్భంగా స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన యోధులకు సీఎం ఘన నివాళులు అర్పించారు. ప్రజల మాటకు విలువ ఇవ్వడం, వారి సమస్యలకు పరిష్కారం చూపడం, హక్కులను కాపాడడం, ప్రభుత్వ వనరులు అందరికీ చేరేలా చూడడమే ప్రజా పాలన లక్ష్యమని పేర్కొన్నారు.
రైతు సంక్షేమానికి భారీ ప్రాధాన్యం
రైతు కుటుంబాలకు అండగా రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేశామని సీఎం తెలిపారు. రూ.20,616 కోట్లు విడుదల చేసి 25.35 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ చేసినట్లు వివరించారు. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశామని, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామని చెప్పారు. వ్యవసాయం, రైతు సంక్షేమానికి 32 నెలల్లో దాదాపు రూ.1.72 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా కోసం న్యాయపోరాటం కొనసాగిస్తున్నామని, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతలు, ఎస్ఎల్బీసీ తదితర పెండింగ్ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు.
మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, దీంతో ఆడబిడ్డలకు రూ.12,385 కోట్ల మేర ప్రయాణ ఖర్చు ఆదా అయిందని తెలిపారు. గృహజ్యోతి కింద 53 లక్షలకు పైగా కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 43 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని చెప్పారు.
సామాజిక న్యాయానికి పెద్దపీట
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపినట్లు సీఎం తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ చేపట్టామని చెప్పారు.
విద్య–వైద్య రంగాల్లో కీలక చర్యలు
ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభించామని తెలిపారు. విద్యార్థులకు అల్పాహారం, పాలు అందించేందుకు రూ.927 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 5.19 లక్షల మందికి రూ.2,526 కోట్ల సాయం అందించామని తెలిపారు. గోషామహల్లో రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం ప్రారంభమైందని చెప్పారు.
యువతకు ఉద్యోగాలు.. నైపుణ్యాలకు ప్రాధాన్యం
72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా పూర్తి చేశామని సీఎం తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి, ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని చెప్పారు. యువత ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
‘తెలంగాణ రైజింగ్–2047’ లక్ష్యంతో ముందుకు
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని సీఎం వెల్లడించారు. భారత్ ఫ్యూచర్ సిటీని దాదాపు 30 వేల ఎకరాల్లో దేశంలో తొలి నెట్-జీరో స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
ఫ్యూచర్ సిటీలో ఏఐ సిటీ, హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, ఈవీ పార్క్, లైఫ్ సైన్సెస్ హబ్ వంటి ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు, గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, డ్రైపోర్టులు, పారిశ్రామిక కారిడార్లతో తెలంగాణ ముఖచిత్రం మారనుందని పేర్కొన్నారు.
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రజల సహకారం
ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని సీఎం తెలిపారు. విద్యుత్ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజల నుంచి కూడా సహకారం అవసరమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


