హైదరాబాద్, సెప్టెంబర్ 18: ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కోరారు. దక్షిణ రాష్ట్రాల వ్యవసాయ సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రిని సీఎం శుక్రవారం మాదాపూర్‌లో కలిసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు.
మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తదితరులతో కలిసి వర్షాభావ పరిస్థితులపై వివరాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. వర్షాలు తగ్గడంతో వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం పెరిగిందని, తాగునీరు, విద్యుత్ కొరత తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందని సీఎం వివరించారు.
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులను ప్రత్యామ్నాయ పంటలు, పంటల మార్పిడి వైపు ప్రోత్సహిస్తున్నామని సీఎం తెలిపారు. పంటల వైవిధ్యీకరణకు కేంద్ర సహకారం అందించాలని కోరారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 250 ఎకరాల్లో ఫలాలు, కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు.
మిగిలిన 9.56 లక్షల ఇళ్లు ఇవ్వాలి
PMAY-G పథకం కింద తెలంగాణకు తొలి విడతగా 2 లక్షల ఇళ్లు కేటాయించినందుకు కేంద్ర మంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. గత జూలైలో 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికే కేటాయించిన 2 లక్షల ఇళ్లకు అదనంగా రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా మిగిలిన 9.56 లక్షల ఇళ్లను కూడా కేటాయించాలని శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కోరారు.
దేశంలో పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందిస్తున్నామని, సన్న వడ్ల సాగును ప్రోత్సహించేందుకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామని సీఎం వివరించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


