సింగోటం: నాగర్కర్నూల్ జిల్లా సింగోటం గ్రామంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. సింగోటంలోని శ్రీవారి సముద్రంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
సింగోటం మత్స్యకారుల పారిశ్రామిక సంఘం సభ్యుడైన బీనముని కృష్ణయ్య రోజువారీగా తన కులవృత్తిని నమ్ముకుని చేపల వేట చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఎప్పటిలాగే చేపల వేటకు వెళ్లిన కృష్ణయ్య ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
మృతుడు కృష్ణయ్యకు భార్య కృష్ణవేణితో పాటు కుమారులు రాఘవేందర్, శివ, కుమార్తె దస్మిత ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న కృష్ణయ్యను కోల్పోవడంతో భార్యాబిడ్డలు కన్నీరుమున్నీరుగా విలపించారు.
కృష్ణయ్య మృతితో సింగోటం మత్స్యకారుల సంఘంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తోటి మత్స్యకారులు ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


