నాగర్కర్నూల్: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగర్కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి. పాటిల్, ఐపీఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం అయిన చారిత్రక ఘట్టాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని అన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, వీరోచిత పోరాటాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
చాకలి ఐలమ్మ, కొమురం భీమ్ వంటి వీరుల పోరాటాలు ప్రజలకు స్ఫూర్తిదాయకమని ఎస్పీ పేర్కొన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని, ఆయన చొరవతో ఆపరేషన్ పోలో నిర్వహించబడిందని తెలిపారు.
చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడంతో పాటు, దాని ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయాలని ఎస్పీ సూచించారు. జిల్లా పోలీసుల పనితీరు బాగుందని అభినందిస్తూ, ఇదే స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా పనిచేసి నాగర్కర్నూల్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని పోలీసు అధికారులు, సిబ్బందికి పిలుపునిచ్చారు.
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ బుర్రి శ్రీనివాస్, ఇతర పోలీసు అధికారులు, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


