పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో వినాయక నిమజ్జనం వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఆరుగురు బాలురు ప్రమాదవశాత్తూ చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
స్థానికుల కథనం ప్రకారం.. పెద్ద కంజర్ల గ్రామంలోని నేరేడు చెరువులో వినాయక విగ్రహ నిమజ్జనం చేసేందుకు కొందరు బాలురు వెళ్లారు. నిమజ్జనం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ లోతైన నీటిలోకి జారిపోయారు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి ఆరుగురు బాలురు మృతి చెందినట్లు తెలుస్తోంది.
మృతిచెందిన బాలురంతా స్థానికంగా ఉన్న ‘శిరీష చారిటబుల్ ట్రస్ట్’లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులుగా గుర్తించినట్లు సమాచారం. ఒకేసారి ఆరుగురు చిన్నారులు మృత్యువాత పడటంతో పెద్ద కంజర్ల గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. చిన్నారుల మృతితో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. మృతుల పూర్తి వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


