తెలకపల్లి, సెప్టెంబర్ 16 (తొలి కిరణం): తెలకపల్లి మండలం లక్నవరం గ్రామంలో బుధవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దూల సువర్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కూచకుల దామోదర్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సహకరిస్తామని పేర్కొన్నారు.
అదేవిధంగా లక్నవరం నుంచి రాకొండ వరకు బీటీ రోడ్డు ఏర్పాటుకు అన్ని విధాలా సహకరిస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. త్వరలోనే రోడ్డు పనులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అలాగే గ్రామంలోని పాఠశాల కిచెన్ షెడ్ నిర్మాణానికి రూ.4 లక్షల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు.
శిథిలావస్థలో పాఠశాల భవనం
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా గ్రామ యువకులు లక్నవరం పాఠశాలకు నూతన భవనం మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. గ్రామ యువకుడు దాసర్ల శరత్ ఆధ్వర్యంలో యువకులు ఈ వినతిపత్రాన్ని సమర్పించారు.
పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులకు ప్రమాదకరంగా మారిందని, అదనపు తరగతి గదుల అవసరం ఉందని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నూతన పాఠశాల భవనాన్ని మంజూరు చేయాలని కోరారు.
వినతిపత్రం అందుకున్న అనంతరం ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గ్రామంలోని పాఠశాలను సందర్శించి భవనం పరిస్థితిని పరిశీలించారు. ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకుని తరగతి గదులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఒక తరగతి గదిలో పైకప్పు పెచ్చులు ఊడిపోయిన పరిస్థితిని గమనించారు.
పాఠశాలలో నెలకొన్న పరిస్థితులపై స్పందించిన ఎమ్మెల్సీ విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. తన శాయశక్తులా కృషి చేసి పాఠశాలకు నూతన భవనం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని ఉపాధ్యాయులు, గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల నాయకులు, గ్రామ యువకులు, మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

