ప్రతినిధి తెలకపల్లి : మండల ప్రత్యేక అధికారి కె. ఉమాపతి అధ్యక్షతన మంగళవారం మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల పనితీరు, ప్రగతి, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై శాఖల వారీగా సమీక్ష చేపట్టారు.
సమావేశంలో ఎంపీడీవో తరుణ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో జలసిరి కార్యక్రమం కింద చేపట్టాల్సిన పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించడంతో పాటు కమ్యూనిటీ సోక్పిట్స్ ఏర్పాటు చేయాలని, ప్రతి రైతు పొలంలో పంటకుంట నిర్మించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అలాగే ప్రతి గ్రామంలో ఊటకుంటలను నిర్మించి వర్షపు నీటిని ఒడిసిపట్టేలా ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని సూచించారు. తద్వారా భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
గ్రామాల్లో నీటి సంరక్షణకు సంబంధించిన పనులను సమర్థవంతంగా అమలు చేసి, నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో తరుణ్ తెలిపారు.
సమావేశంలో మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, గౌరవ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

