బిజినపల్లి, సెప్టెంబర్ 15:
బిజినపల్లి మండలం మంగనూరు గ్రామ శివారులోని కొత్తకుంట ఎఫ్టీఎల్ పరిధిలో మత్స్యకారుల హక్కులకు భంగం కలుగుతోందన్న ఫిర్యాదులపై అధికారులు స్పందించారు. మత్స్యకారులు అందించిన వినతిపత్రాలు, ఫిర్యాదులను అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే మండల స్థాయిలో పోరాటాలకు సిద్ధమని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో బిజినపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘ భవనంలో మండలంలోని వివిధ గ్రామాల సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. మత్స్యకారుల సమస్యలను తహసీల్దార్, నీటిపారుదల శాఖ, జిల్లా మత్స్యశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జిల్లా మత్స్యశాఖ అధికారి బి. నరసింహారావు, నీటిపారుదల శాఖ అధికారి ప్రేమ్ కుమార్, ఎస్సై తదితరులు కొత్తకుంటను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.
చేపలు పట్టే హక్కు మత్స్యకారులదే
కొత్తకుంటలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేపలు పట్టే హక్కు మత్స్యకారులకే ఉంటుందని జిల్లా మత్స్యశాఖ అధికారి బి. నరసింహారావు స్పష్టం చేశారు. కుంటలో నీరు తగ్గి భూమి బయటకు వచ్చిన అనంతరం మాత్రమే పట్టాదారులు సాగు చేసుకోవచ్చని, నీరు ఉన్న సమయంలో చేపలు పట్టే హక్కు పట్టాదారులకు ఉండదని తెలిపారు. నిబంధనల ప్రకారం రుసుము చెల్లించి ఫిషింగ్ రైట్స్ పొందిన అనంతరం మాత్రమే చేపలు పట్టాలని సూచించారు.
ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో నిర్మాణాలు వద్దు
కొత్తకుంట ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో గుంతలు తీయడం, కట్టలు వేయడం, ఇతర నిర్మాణాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ నీటిపారుదల చట్టం 1357 ఫస్లీ సెక్షన్లు 39, 40 ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
గొడవలకు దూరంగా ఉండాలి
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ అధికారుల సూచనలు పాటించాలని ఎస్సై సూచించారు. హక్కుల పరిరక్షణ కోసం ఆవేశానికి లోనై గొడవలకు దిగకుండా, సమస్యలను చట్టపరంగా పరిష్కరించుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో మండల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు తుమ్మల అల్లోజి, గౌరవ అధ్యక్షులు బొందయ్య, యాదయ్య, బోలా కృష్ణయ్య, గూడ కాశన్న, కార్యదర్శి బంగారయ్య, శంకర్, ఇ. మల్లికార్జున్, చింతకాయల యాదయ్యతో పాటు వివిధ గ్రామాల మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



