మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, అల్వాల్: అల్వాల్ సర్కిల్ పరిధిలోని సూర్యనగర్‌లో యువతి శివాని అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ఆమెను భర్త పరశురాం గొంతు నులిమి హత్య చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని మృతురాలి తండ్రి వెంకటేష్ వెల్లడించారు.
వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పరశురాం ఫోన్ చేసి, శివాని బాత్రూం వద్ద జారిపడి స్పృహ కోల్పోయిందని చెప్పాడు. దీంతో వెంకటేష్ వెంటనే సూర్యనగర్‌కు చేరుకుని అంబులెన్స్‌తో పాటు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది శివాని అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరశురాంను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన భార్యను గొంతు నులిమి హత్య చేసినట్లు పరశురాం అంగీకరించినట్లు వెంకటేష్ పేర్కొన్నారు.
పరశురాం రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, భార్యాభర్తల మధ్య పెద్దగా గొడవలు లేవని వెంకటేష్ తెలిపారు. ఘటన జరిగిన రాత్రి పరశురాం మద్యం సేవించి ఇంటికి వచ్చినట్లు చెప్పారు. తన కుమార్తెను హత్య చేయడానికి గల కారణాలు తమకు తెలియడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హత్యకు అసలు కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


