అల్వాల్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అల్వాల్ సర్కిల్ పరిధిలో ఓ మైనర్ బాలికపై పలువురు యువకులు లైంగిక దాడులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల బాలికకు పదో తరగతిలో ఉన్న సమయంలో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని మత్తు పదార్థాలు అలవాటు చేసి, కారులో బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ఆ తర్వాత మరికొందరు వ్యక్తులతో పరిచయం ఏర్పడగా.. బాలికను మద్యం, సిగరెట్లు, గంజాయి తదితర మత్తు పదార్థాలకు బానిస చేసి, వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక దాడులకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ నెల 9న కుటుంబ సభ్యులు బాలిక ప్రవర్తనలో మార్పును గమనించి మందలించడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అనంతరం రైల్వే స్టేషన్ వద్ద పరిచయమైన కొందరు వ్యక్తులు ఆమెకు మత్తు పదార్థాలు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో ప్రాంతంలోని ఓయో గదికి తీసుకెళ్లి పలువురు కలిసి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
అక్కడి నుంచి తప్పించుకున్న బాలికను మళ్లీ అడ్డుకుని మరోసారి మత్తులోకి దించి రైలులో కూడా లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం వారి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని వివరించింది.
దీంతో కుటుంబ సభ్యులు అల్వాల్ పోలీసులను ఆశ్రయించగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సమాచారం.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


