హైదరాబాద్, సెప్టెంబర్ 15: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణలో భారీ వర్షాలు
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
పెద్దపల్లి, కరీంనగర్, మెదక్, మల్కాజ్గిరి జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా.. సంగారెడ్డి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు కూడా వర్ష సూచన చేసింది. మొత్తం 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రజలకు కీలక సూచనలు
మెరుపులు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగల సమీపంలో నిలబడవద్దని అధికారులు సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు వర్షం, పిడుగుల సమయంలో పనులు నిలిపివేసి సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


