నాగర్కర్నూల్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో గణపతి పూజలను వైభవంగా నిర్వహించారు.
సోమవారం ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ ఆకుతోట రోహిత్ కుమార్ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆసుపత్రికి వైద్య సహాయం కోసం, చికిత్స నిమిత్తం వచ్చే ప్రతి రోగికి ఎలాంటి విఘ్నాలు కలగకుండా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర సిబ్బంది సమర్థవంతమైన ఆరోగ్య సేవలు అందించాలని, ప్రతి రోగి త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తమ ఇళ్లకు చేరాలని స్వామివారిని ప్రార్థించారు.
అనంతరం రోగుల సహాయకులకు, ఆసుపత్రి సిబ్బందికి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ నర్స్ పద్మ, నర్సింగ్ అధికారులు, ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


