బిజినపల్లి మండలం గుడ్లనర్వ: వినాయక చతుర్థి వేడుకలను పర్యావరణహితంగా నిర్వహించడంతో పాటు గోసంరక్షణకు చేయూతనందించాలనే ఉద్దేశంతో ‘గోపాల్స్’ సంస్థ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీ మేకల రాజమల్లయ్య (రాజు)–మల్లికార్జున కన్స్ట్రక్షన్స్ వారి ఆర్థిక సహకారంతో భక్తులకు ఉచితంగా గోమయ గణపతి ప్రతిమలను పంపిణీ చేస్తున్నారు.
గోమయంతో తయారు చేసిన గణపతి ప్రతిమలను వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటంతో పాటు దేశీయ గోవుల సంరక్షణ, గోశాలల నిర్వహణకు సహకారం అందించినట్లవుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు కూడా పరోక్షంగా ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా సహజసిద్ధమైన గోమయ గణపతులను ప్రతిష్ఠించాలని నిర్వాహకులు కోరారు. పూజా సామగ్రి, అలంకరణ వస్తువులను కూడా సాధ్యమైనంత వరకు ప్రకృతికి హాని కలిగించని సహజ పదార్థాలతో వినియోగించాలని సూచించారు.
గోపాల్స్ సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన శ్రీ మేకల రాజమల్లయ్య (రాజు)–మల్లికార్జున కన్స్ట్రక్షన్స్ వారికి సంస్థ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ గోమయ గణపతులను ప్రతిష్ఠించి గోసంరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసిన దాసరి సురేష్, మేకల లక్ష్మీకాంత్, మండలి యాదగిరి, పూరి రాజేష్, లక్ష్మణ్ దాసు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


