హైదరాబాద్: పేద ఆర్యవైశ్య కుటుంబాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. సౌమ్యులు, మానవతావాదులుగా ఆర్యవైశ్యులు సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందారని, పేదల విశ్వాసానికి వారు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, మాజీ మంత్రి టీజీ వెంకటేష్, పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ముఖ్యంగా పేద ఆర్యవైశ్య కుటుంబాల పిల్లలకు ఈ భవనం సంపూర్ణంగా ఉపయోగపడేలా చూడాలని సంఘాల ప్రతినిధులకు సూచించారు.
సాధారణ ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించిన మహాత్మా గాంధీ ప్రపంచస్థాయి నాయకుడిగా ఎదగడం గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో గాంధీజీ విగ్రహాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక మంత్రిగా కొణిజేటి రోశయ్య అందించిన సేవలను ప్రస్తావించారు.
గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు సరుకులను అరువుగా ఇచ్చే విషయంలో ఆర్యవైశ్యులు మానవతతో వ్యవహరిస్తారని, అందుకే వారు విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలిచారని సీఎం అన్నారు. ముందు చూపుతో వ్యవహరించడం, జాగ్రత్తగా ఉండటం ఆర్యవైశ్యుల ప్రత్యేకతగా పేర్కొన్నారు.
ఐక్యతే బలం: ఆర్యవైశ్యులంతా కలిసికట్టుగా, సమైక్యంగా ఒక్కతాటిపై నడిస్తేనే మరింత బలం చేకూరుతుందని సీఎం సూచించారు. ఐక్యతతో ముందుకు సాగితే రాజకీయాల్లో తమ వాటాను తామే సాధించుకోగలరని అన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత కల్పించామని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


