తెలకపల్లి, సెప్టెంబర్ 13: తెలకపల్లి మండలం లక్నారం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రైతు తలారి చిన్నయ్య తండ్రి నిరంజన్‌కు చెందిన ఎద్దు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగకు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో రైతు కుటుంబంలో విషాదం నెలకొంది.
వివరాల ప్రకారం.. రైతు తలారి చిన్నయ్య తన సొంత పంట పొలంలో ఎద్దును మేపుతుండగా, కంప చెట్ల పొదల్లో ప్రమాదకరంగా విద్యుత్ తీగ పడి ఉంది. గడ్డి మేస్తూ ముందుకు వెళ్లిన ఎద్దు మెడకు కరెంట్ తీగ చుట్టుకోవడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఎద్దు కిందపడిన విషయాన్ని గమనించిన రైతు వెంటనే అక్కడికి చేరుకునేసరికి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.
వారం రోజుల క్రితమే రూ.95 వేలకు కొనుగోలు
మృతి చెందిన ఎద్దును రైతు చిన్నయ్య వారం రోజుల క్రితమే తెలకపల్లి సంతలో రూ.95 వేలతో కొనుగోలు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఎంతో ఆశతో కొనుగోలు చేసిన ఎద్దు వారం రోజులు గడవకముందే మృతి చెందడంతో రైతు తీవ్రంగా నష్టపోయి కన్నీరుమున్నీరవుతున్నారు.
విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమా?
పంట పొలాల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉండటం, కంప చెట్ల పొదల్లో తీగలు తేలి ఉండటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను ముందుగానే గుర్తించి అధికారులు చర్యలు తీసుకుని ఉంటే ఈ ఘటన జరిగేది కాదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.95 వేల నష్టపరిహారం ఇవ్వాలి
ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఘటనపై పరిశీలన జరిపి రైతు తలారి చిన్నయ్యకు రూ.95 వేల నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పొలాల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను వెంటనే సరిచేయాలని కోరారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

