• పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
కల్వకుర్తి: కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
శ్రీశైలంలో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటిని పూర్తిస్థాయిలో ఎత్తిపోయలేని పరిస్థితి నెలకొందని వారు ఆరోపించారు. ఎత్తిపోతల మోటార్లకు 24 గంటల విద్యుత్ అందించి రైతులకు సాగునీరు అందించాల్సిన ప్రభుత్వం ఉదయం మోటార్లు నడిపి రాత్రి కరెంటు నిలిపివేస్తోందని విమర్శించారు.
కల్వకుర్తి ఎత్తిపోతల మోటార్లను ఇష్టానుసారంగా ఆన్, ఆఫ్ చేయడం వల్లే మోటార్లకు మరమ్మతులు అవసరమైన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఒక్క మోటారుతో కాలం వెళ్లదీస్తూ రైతులకు సరిపడా నీరు అందించడం లేదని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ వైపు కృష్ణా జలాల తరలింపుపై కూడా మాజీ మంత్రులు తీవ్రంగా స్పందించారు. ఏపీ రోజుకు భారీగా నీటిని తరలించుకుపోతుంటే తెలంగాణకు మాత్రం తగినంత నీరు అందకపోవడంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కృష్ణా జలాలను పెన్నా బేసిన్ వరకు తరలించే ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని గత ప్రభుత్వం దాదాపు 90 శాతం పూర్తి చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లలో కాల్వల నిర్మాణంలో ఆశించిన పురోగతి కనిపించలేదని విమర్శించారు. సామాన్య రైతుకు ఉన్న అవగాహన కూడా ముఖ్యమంత్రికి లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలోనే రైతులు విద్యుత్ కోసం హైవేపై రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. సాగునీరు అందకపోవడం రైతులకు జీవన్మరణ సమస్యగా మారుతోందని, ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి అన్ని పంపింగ్ స్టేషన్ల వద్ద మోటార్లు నిరంతరం పనిచేసేలా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. మోటార్లను ఆన్, ఆఫ్ చేస్తూ ప్రభుత్వం దాగుడుమూతలు ఆడటం మానుకోవాలని సూచించారు.
ప్రతి పంపింగ్ స్టేషన్ వద్ద టెంట్లు ఏర్పాటు చేసి నిఘా పెట్టి మోటార్ల నిర్వహణను పరిశీలిస్తామని వారు తెలిపారు. రైతులకు సాగునీరు అందించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళన వంటి అంశాలపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ పాలమూరు ప్రాంత సాగునీటి సమస్యలపై చూపడం లేదని విమర్శించారు. రైతుల ప్రధాన సమస్యలను పక్కనపెట్టి ప్రభుత్వం ఇతర కార్యక్రమాలపై దృష్టి సారిస్తోందని ఆరోపించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సమస్యలపై పాదయాత్ర చేపడతామని ప్రకటించినప్పుడు అధికారులు పరుగులు పెట్టారని, ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కల్వకుర్తి ఎత్తిపోతల మోటార్లను వెంటనే పూర్తిస్థాయిలో నడిపించి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కోరారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



