పెద్దకొత్తపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని కల్వకోలు గ్రామానికి చెందిన ఎంఆర్పీఎస్ నాయకుడు నలవాల భానుప్రసాద్‌కు గ్రామస్థులు, నాయకులు, స్నేహితులు, అభిమానులు అశ్రునయనాల మధ్య ఘనంగా తుది వీడ్కోలు పలికారు.
హైదరాబాద్‌లోని భూదేవి నగర్లో వినాయకుడి విగ్రహాన్ని తీసుకువస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి విద్యుత్ షాక్‌కు గురై భానుప్రసాద్ మృతిచెందారు. ఈ విషాద ఘటనతో కల్వకోలు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
భానుప్రసాద్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి భూదేవి నగర్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న ఎంఆర్పీఎస్ మండల నాయకులు, గ్రామ నాయకులు, స్నేహితులు, అభిమానులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో కల్వకోలు గ్రామానికి చేరుకున్నారు. ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
భానుప్రసాద్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. ఎంఆర్పీఎస్ కోసం ఆయన చేసిన సేవలను నాయకులు, స్నేహితులు గుర్తుచేసుకున్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే భానుప్రసాద్ ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక పలువురు భావోద్వేగానికి గురయ్యారు.
అనంతరం భానుప్రసాద్ అంతిమయాత్రను భారీగా నిర్వహించారు. గ్రామ వీధుల గుండా సాగిన అంతిమయాత్రలో ప్రజలు, స్నేహితులు, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. “భానుప్రసాద్ అమర్ రహే” అంటూ నినాదాలు చేస్తూ అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. భారీ జనసందోహం మధ్య అంతిమయాత్ర విషాదభరిత వాతావరణంలో కొనసాగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద ఏసు, గ్రామ అధ్యక్షుడు మద్దిలేటి, రాంబాబు, రమేష్, అడ్వకేట్ నిరంజన్, విశ్వనాథం, పీఆర్టీయూ మండల కార్యదర్శి పరమేష్, సుదర్శన్, ఉపాధ్యాయులు, ఎంఆర్పీఎస్ మండల, గ్రామ నాయకులు, స్నేహితులు, కార్యకర్తలు, గ్రామస్థులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



