రైల్వేకోడూరు: తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేట పంచాయతీలోని ఉద్యాన కళాశాలలో నిర్వహిస్తున్న మెగా రక్త వారోత్సవాల్లో భాగంగా ఏడో రోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని ఉద్యాన కళాశాలలో జేబీవీఎస్ ది ప్రెసివర్, కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ పి.టి. శ్రీనివాస్ మాట్లాడుతూ.. రక్తదానం అత్యవసర సమయంలో ఒకరి ప్రాణాన్ని కాపాడే గొప్ప సామాజిక సేవ అని అన్నారు. విద్యార్థి దశ నుంచే సేవా కార్యక్రమాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులుగా ఎదగవచ్చని పేర్కొన్నారు. రక్తదాన శిబిరంలో విద్యార్థులు చురుగ్గా పాల్గొనడం అభినందనీయమన్నారు.
ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ బి. హరి, మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన యువత రక్తదానం చేయడం ద్వారా రక్తం అవసరమైన వారికి అండగా నిలవడంతో పాటు వారి ప్రాణాలను కాపాడినవారవుతారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో ఉండటం ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ఎన్ఎస్ఎస్ యూనిట్–2 ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎస్.బి. రమ్యలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో రక్తదానంపై అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన సమయంలో సమాజానికి సేవ చేయాలనే భావనను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు, సంస్థ సభ్యులు వీరాచారి, లేఖన్తో పాటు విద్యార్థి రక్తదాతలు పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


