రైల్వేకోడూరు: తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పోలీసు అధికారులను ఆదేశించారు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ వై. శ్రీనివాసరావు, కోడూరు రూరల్ సీఐ డి. శ్రీనివాసులతో కలిసి బుధవారం ఓబుళవారిపల్లి మండలంలోని మంగంపేట చెరువు, చిట్వేల్ మండలంలోని ఎల్లంరాజు చెరువు వద్ద ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు.
నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నిమజ్జనానికి వచ్చే భక్తుల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తు, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
నిమజ్జన ప్రాంతాల్లో అవసరమైన భద్రతా ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ సూచించారు. భక్తులు పోలీసుల సూచనలు, నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని, భద్రతా ఏర్పాట్లలో పోలీసులకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఓబుళవారిపల్లి ఎస్ఐ సుజన్ కుమార్, చిట్వేల్ ఎస్ఐ ఎస్. వినోద్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


