రైల్వేకోడూరు: తిరుపతి జిల్లా రైల్వేకోడూరులో సంచలనం సృష్టించిన 70 ఏళ్ల వృద్ధురాలు రాజుపాలెం మంగమ్మ హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి బంగారు ఆభరణాలు, నగదు, సెల్‌ఫోన్‌తో పాటు నేరానికి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
రైల్వేకోడూరు పట్టణంలోని వినాయకనగర్‌లో మంగమ్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్, ఫింగర్‌ప్రింట్స్, డ్రోన్ సర్వైలెన్స్‌తో పాటు సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. మృతురాలు ఒంటరిగా నివసిస్తుండటంతో పాటు ఆమె వద్ద ఉన్న సుమారు నాలుగు తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో ఆభరణాల కోసమే హత్య జరిగి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేశారు.
ఈ క్రమంలో వినాయకనగర్‌కు చెందిన జైనూ బీ, ఆమె కుమారుడు ఇస్సాక్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మంగమ్మను ఇంట్లోకి పిలిపించి ఆమెపై దాడి చేసి హత్య చేసిన అనంతరం, ఆమె ధరించిన బంగారు గొలుసు, చెవికమ్మలు, ఉంగరాన్ని తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం ఆధారాలను తొలగించే ప్రయత్నంలో భాగంగా మృతదేహాన్ని ఇంటి బయటకు తీసుకువచ్చి సందులో పడేసినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు ఇస్సాక్ బంగారు చెవికమ్మలను పాన్ బ్రోకర్ వద్ద కుదువ పెట్టి రూ.5 వేల నగదు తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
స్వాధీనం చేసుకున్నవి: 32.350 గ్రాముల బంగారు గొలుసు, 3 గ్రాముల బంగారు చెవికమ్మలు, 2.450 గ్రాముల బంగారు ఉంగరం, రూ.2,500 నగదు, సెల్‌ఫోన్, నేరానికి ఉపయోగించిన గుండ్రాయి, విరిగిన పప్పుగుత్తి, బంగారు చెవికమ్మలు కుదువ పెట్టిన రసీదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు ఇస్సాక్పై గతంలోనూ రైల్వేకోడూరు, రాజంపేట, పుల్లంపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం ఆరు దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
కేసును వేగంగా ఛేదించిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ అభినందించారు. ఒంటరిగా నివసించే వృద్ధుల భద్రతపై కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే 112కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


