రైల్వేకోడూరు, సెప్టెంబర్ 9: తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలంలోని గంగరాజుపాడు, చియ్యవరం గ్రామాల్లో మంగళవారం తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్ ఆధ్వర్యంలో అతుకుబడి పట్టాలపై విచారణ నిర్వహించారు. రైల్వేకోడూరు మండలంలోని పలు గ్రామాల్లో అతుకుబడి పట్టాలకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఎట్టకేలకు ఆర్డీఓ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ రైల్వేకోడూరు మండలంలో అతుకుబడి పట్టాలకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి రైతుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూమికి సంబంధించిన సమస్యలపై న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఈ అంశంపై సంబంధిత రెవెన్యూ అధికారులతో చర్చించినట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ అమర్నాథ్, ఆర్ఐ లక్ష్మీదేవి, వీఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు.


