పాలెం: మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక కార్యక్రమమే ఆరోగ్య మహిళా కార్యక్రమం అని పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఎం. ప్రియాంక తెలిపారు. ప్రతి మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఆరోగ్య మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మహిళల ఆరోగ్య సమస్యలను గుర్తించి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, మెరుగైన వైద్యం అవసరమైన వారిని ఉన్నత వైద్య కేంద్రాలకు రిఫర్ చేస్తున్నట్లు తెలిపారు. మహిళల ప్రజనన, లైంగిక ఆరోగ్య సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, మానసిక ఆరోగ్య సమస్యలు, మధుమేహం, అధిక రక్తపోటు, ఆస్టియోపోరోసిస్, నెలసరి సమస్యలు తదితర అనారోగ్య సమస్యలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.
మహిళల ఆరోగ్యమే ఆరోగ్యకర సమాజానికి పునాది అని డాక్టర్ ప్రియాంక పేర్కొన్నారు. మహిళలు శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఆరోగ్యంగా ఉండటం ఎంతో ముఖ్యమన్నారు. కుటుంబ బాధ్యతల్లో నిమగ్నమై చాలామంది మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు.
ప్రతి మహిళ పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారంతో పాటు తగినంత నీరు తీసుకోవాలన్నారు. ప్రతిరోజూ వ్యాయామం లేదా తగినంత శారీరక శ్రమ చేయడం వల్ల శరీరం చురుగ్గా ఉంటుందని తెలిపారు. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల ప్రశాంతమైన నిద్ర అవసరమని, మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటూ సానుకూల దృక్పథంతో జీవించాలని సూచించారు.
ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమానికి 50 నుంచి 100 మంది వరకు మహిళలు వివిధ ఆరోగ్య సమస్యలతో ఆరోగ్య కేంద్రానికి వస్తున్నారని డాక్టర్ ప్రియాంక తెలిపారు. వారికి ఓపికగా ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ టీ-హబ్ ద్వారా రక్తం, మూత్రం తదితర అవసరమైన పరీక్షలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
“ఆరోగ్యమే మహాభాగ్యం” అనే పెద్దల మాట ఎంతో అనుభవంతో చెప్పిన సత్యమని ఆమె అన్నారు. మనిషికి ఎంత ధనం, ఆస్తులు, హోదా ఉన్నప్పటికీ ఆరోగ్యం లేకపోతే వాటిని ఆస్వాదించలేమని, అందుకే సంపద కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆమెతో పాటు కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుందని, తద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి బాటలు పడతాయని డాక్టర్ ప్రియాంక తెలిపారు. మహిళలందరూ ప్రతి మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డాక్టర్ ఎం. ప్రియాంక పిలుపునిచ్చారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):




