నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 7: నాగర్‌కర్నూల్ జిల్లా ప్రజలకు సంబంధించిన కీలక ప్రజా ప్రయోజన అంశాలపై అధికారిక ప్రభుత్వ రికార్డుల ద్వారా వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్‌కర్నూల్ జిల్లా ఆధ్వర్యంలో సోమవారం పలు ప్రభుత్వ శాఖలకు సమాచార హక్కు చట్టం–2005, సెక్షన్ 6(1) కింద విస్తృతంగా RTI దరఖాస్తులు సమర్పించినట్లు జిల్లా జనరల్ సెక్రటరీ, మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీవిద్య గౌడ్ సీతారాల తెలిపారు. ప్రజా నిధులు, ప్రభుత్వ భూములు, సహజ వనరులు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, వ్యవసాయ రంగం, ప్రభుత్వ గృహ నిర్మాణానికి సంబంధించిన వాస్తవాలు ప్రభుత్వ రికార్డుల ద్వారా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.ప్రభుత్వ భూములు–ఆక్రమణలపై పూర్తి వివరాలు: 2014 నుంచి 2026 వరకు నాగర్‌కర్నూల్ నియోజకవర్గం, జిల్లాలోని ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు, విస్తీర్ణం, భూమి వర్గీకరణ, అసైన్డ్ భూములు, Alienation, Assignment, Regularisation, NALA Conversion, భూముల బదలాయింపులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించిన వివరాలను రెవెన్యూ శాఖను కోరినట్లు తెలిపారు. ఆక్రమణలపై నమోదైన కేసులు, ఆక్రమిత విస్తీర్ణం, నోటీసులు, స్వాధీనం చర్యలు, పోలీస్ కేసులు, జరిమానాలు, రికవరీలు, తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్న భూముల వివరాలను కూడా కోరినట్లు వెల్లడించారు. కొల్లాపూర్ ఎక్స్ రోడ్, తాడూరు రోడ్డు, ఉయ్యాలవాడ ప్రభుత్వ మెడికల్ కాలేజీ పరిసరాలు, ఉయ్యాలవాడ–ఎర్రగుట్ట, తుడుకుర్తి–ఎర్రగుట్ట, ఇంద్రకల్–కొమ్ముగుట్ట ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములు, గుట్టలు, భూముల వినియోగానికి సంబంధించిన అధికారిక రికార్డులను సైతం కోరినట్లు తెలిపారు.నల్లమట్టి.. ఎర్రమట్టి.. గుట్టల తవ్వకాలపై లెక్కలు చెప్పాలి: మైన్స్ అండ్ జియాలజీ శాఖ నుంచి ఇసుక, నల్లమట్టి, ఎర్రమట్టి, మోరం, ఇతర మైనర్ మినరల్స్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు, క్వారీలు, లీజులు, తవ్వకాల పరిమాణం, రాయల్టీ, సీనరేజ్, ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం, తనిఖీలు, అక్రమ తవ్వకాలపై నమోదైన కేసులు, తీసుకున్న చర్యల వివరాలను కోరినట్లు తెలిపారు. ప్రకృతి వనరులు ప్రజల ఆస్తి కాబట్టి వాటి వినియోగంలో పారదర్శకత ఉండాలని, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పూర్తిగా వచ్చిందా లేదా అనేది అధికారిక రికార్డుల ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.రోడ్లు.. డ్రైనేజీలు.. బ్రిడ్జిలు.. కాంట్రాక్టులపై పారదర్శకత: పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, ఆర్అండ్బీ శాఖలకు సంబంధించిన RTIలలో రోడ్లు, సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు, డ్రైనేజీలు, కాలువలు, కల్వర్టులు, బ్రిడ్జిలు, ప్రభుత్వ భవనాలు, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లు, కాంట్రాక్టర్లు, అంచనా వ్యయాలు, మంజూరైన నిధులు, విడుదలైన నిధులు, చెల్లింపులు, Agreementలు, Work Orders, Measurement Books, Running Bills, Final Bills, Quality Tests తదితర వివరాలను కోరినట్లు తెలిపారు. పనులు పూర్తయ్యాయా? మధ్యలో నిలిచిపోయాయా? నిధులు ఎంత ఖర్చయ్యాయి? నాసిరకం పనులపై చర్యలు తీసుకున్నారా? కాంట్రాక్టర్లపై Penalty, Recovery, Blacklisting లేదా Agreement Cancellation జరిగిందా? అనే అంశాలపై కూడా సమాచారం కోరినట్లు తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల నుంచి సంక్షేమ పథకాల వరకు: జిల్లా గృహ నిర్మాణ శాఖ, సంబంధిత సంక్షేమ శాఖల నుంచి ఇందిరమ్మ ఇళ్లు, గృహ నిర్మాణ పథకాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఇతర రాష్ట్ర, కేంద్ర సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధుల కేటాయింపు, విడుదల, ఖర్చు, లబ్ధిదారుల సంఖ్య, తిరస్కరించిన దరఖాస్తులు, పథకాల అమలు స్థితిపై అధికారిక వివరాలను కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించే పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా అర్హులైన ప్రజలకు ఎంతమేరకు చేరుతున్నాయో అధికారిక గణాంకాల ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.రైతుల కోసం కేటాయించిన నిధులపై వివరాలు: వ్యవసాయ శాఖ నుంచి రైతుబంధు, రైతు భరోసా, వ్యవసాయ సబ్సిడీలు, విత్తనాలు, ఎరువులు, రైతులకు అందించిన ఇతర ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు, లబ్ధిదారుల సంఖ్య, నిధుల కేటాయింపు, విడుదల, వినియోగానికి సంబంధించిన వివరాలను కోరినట్లు తెలిపారు.ఆరోపణలను నమ్మం.. రికార్డులనే నమ్ముతాం: ఈ RTIల ఉద్దేశం ఏ ఒక్క వ్యక్తిని, అధికారి లేదా సంస్థను ముందుగానే తప్పుబట్టడం కాదని శ్రీవిద్య గౌడ్ సీతారాల స్పష్టం చేశారు. ప్రజా వేదికలు, వార్తా మాధ్యమాలు, సోషల్ మీడియాలో ప్రభుత్వ భూములు, మైనింగ్, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, నియామకాలు తదితర అంశాలపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయని, వాటిని నిజమని గానీ, అబద్ధమని గానీ ముందుగానే చెప్పడం తమ ఉద్దేశం కాదన్నారు. అధికారిక ప్రభుత్వ రికార్డులు ఏమి చెబుతున్నాయో తెలుసుకోవడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రజల సొమ్ముతో జరిగే ప్రతి పని ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రభుత్వ భూమి ప్రజల ఆస్తి, సహజ వనరులు ప్రజల సంపద, ప్రభుత్వ నిధులు ప్రజల పన్నుల సొమ్ము, సంక్షేమ పథకాలు ప్రజల హక్కు అని పేర్కొన్నారు.RTI సమాచారం వచ్చిన తర్వాత వాస్తవాల ఆధారంగానే తదుపరి కార్యాచరణ: RTI ద్వారా అందే అధికారిక సమాచారం ఆధారంగా ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘనలు, నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో లోపాలు లేదా ఇతర అవకతవకలు అధికారికంగా బయటపడితే సంబంధిత చట్టపరమైన, ప్రజాస్వామ్య మార్గాల్లో తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ పోరాటం వ్యక్తులపై కాదని, వ్యవస్థలో పారదర్శకత కోసం అని, రాజకీయ ఆరోపణలపై కాకుండా అధికారిక రికార్డుల కోసం ప్రశ్నిస్తున్నామని శ్రీవిద్య గౌడ్ సీతారాల స్పష్టం చేశారు. ప్రజల తరఫున ప్రశ్నిస్తూ, రికార్డుల ఆధారంగా మాట్లాడుతామని తెలిపారు.


