తెలకపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పాటు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ప్రశ్నించారు. విద్యుత్ కోతలను నిరసిస్తూ సోమవారం తెలకపల్లి మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పశువుల సంత నుంచి ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక వివేకానంద చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేస్తూ ‘బాకీ కార్డు’ను విడుదల చేశారు. రైతులకు రైతు భరోసా కింద ఎకరాకు రూ.12,500 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. రైతు కూలీలకు రూ.12 వేలు, నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు, ఆటో కార్మికులకు రూ.12 వేలు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ద్వారా రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి అమలు చేయలేదన్నారు. మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధాప్య పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదని విమర్శించారు. దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామన్న హామీ, విద్యార్థులకు స్కూటీలు అందిస్తామన్న హామీ అమలు కాలేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూడా పేరుకుపోయాయని ఆరోపించారు. వెయ్యి రోజుల పాలన పూర్తయినా ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ హనుమంతరావు, మాజీ ఎంపీటీసీ రెడ్డపాకుల రమేష్, బీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ, కోట్ల శ్రీనివాస్, పెద్దపల్లి బంగారయ్య, గజ్జ మాధవరెడ్డి, గౌస్ మైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

