బిజినేపల్లి, సెప్టెంబర్ 7: పాలెం గ్రామంలోని పద్మశాలి కులస్తులు బొందలు పెట్టేందుకు స్థలం లేక ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించాలని కోరుతూ బిజినేపల్లి మండల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు.
పాలెం గ్రామంలోని పద్మశాలి కులస్తులు పూర్వం నుంచి చెరువుకట్ట వద్ద బొందలు పెట్టుకుంటూ వస్తున్నారని తెలిపారు. అయితే ఇటీవల చెరువుకట్ట వెడల్పు చేయడంతో గతంలో ఉన్న బొందలు పూడిపోయాయని, దీంతో ప్రస్తుతం చనిపోయిన వారి బొందలు పెట్టేందుకు సరైన స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
గుంతలు తవ్వితే నీళ్లు వస్తున్నాయి
ప్రస్తుతం బొందలు పెట్టేందుకు గుంతలు తవ్వుతున్న సమయంలో నీళ్లు వస్తుండటంతో అంత్యక్రియల అనంతరం బొందలు పెట్టడం ఇబ్బందిగా మారిందని తెలిపారు. చెరువుకట్ట కింద నుంచి నీరు జారిపోవడంతో ఆ ప్రాంతం అపరిశుభ్రంగా మారుతోందని పేర్కొన్నారు.
బీసీలందరికీ ఉపయోగపడేలా శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలి
పాలెం గ్రామంలో ఉన్న 306, 307 సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూమిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అనువుగా ఉంటే బీసీ శ్మశాన వాటిక ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ స్థలాన్ని కేవలం పద్మశాలి కులస్తులకే కాకుండా బీసీ కులస్తులందరికీ ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
తమ సమస్యను అధికారులు మానవతా దృక్పథంతో పరిశీలించి, బొందలు పెట్టేందుకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రభుత్వ భూమిని కేటాయించి బీసీ శ్మశాన వాటిక ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పద్మశాలి కులస్తులు ప్రజావాణి ద్వారా కోరారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


