రాజేష్, తొలి కిరణం ప్రతినిధి, హైదరాబాద్:
శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఇజ్జత్ నగర్ కాలనీలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రజలు, యువత భక్తిశ్రద్ధలతో పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు గంగల రాధాకృష్ణ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుడి విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి రాధాకృష్ణ యాదవ్ ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయ ఉట్టి కొట్టే (దహీ హండీ) కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ‘గోవిందా.. గోవిందా’ అంటూ యువత చేసిన నినాదాలతో కాలనీ పరిసరాలు మార్మోగాయి. డోలు వాయిద్యాల నడుమ యువత ఉత్సాహంగా ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొనగా, రాధాకృష్ణ యాదవ్ స్వయంగా పాల్గొని యువతను ప్రోత్సహించారు.
భక్తులకు అన్నదానం
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా కాలనీలో ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని కూడా గంగల రాధాకృష్ణ యాదవ్ ప్రారంభించారు. భక్తులకు, కాలనీ ప్రజలకు స్వయంగా భోజనం వడ్డించి తీర్థప్రసాదాలు అందజేశారు. అన్నదానం నిర్వహించిన నిర్వాహకులు, కాలనీ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు.
ధర్మ మార్గమే శ్రీకృష్ణుడి సందేశం
ఈ సందర్భంగా రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. ధర్మాన్ని రక్షించడానికి, అధర్మాన్ని రూపుమాపడానికి ద్వాపరయుగంలో శ్రీమహావిష్ణువు ఎనిమిదో అవతారంగా శ్రీకృష్ణుడు అవతరించిన పవిత్రమైన రోజే శ్రీకృష్ణాష్టమి అని అన్నారు. శ్రీకృష్ణుడు చూపిన ధర్మ మార్గం, భగవద్గీత ద్వారా అందించిన సందేశం నేటి సమాజానికి ఎంతో ఆదర్శనీయమన్నారు.
యువత తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఇజ్జత్ నగర్ కాలనీలో యువత సంప్రదాయబద్ధంగా ఉట్టి కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానం అని పేర్కొన్నారు.
ఇజ్జత్ నగర్ కాలనీ ప్రజలకు, యాదవ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ బంధువులందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుడి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


