లింగాల (క్యాంప్ రాయవరం), సెప్టెంబర్ 4, తొలి కిరణం ప్రతినిధి:
పేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఓ అమ్మాయి పట్టుదలతో చదివి వైద్య విద్యలో అడుగుపెట్టింది. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం క్యాంప్ రాయవరం గ్రామానికి చెందిన పెరుమాళ్ల దాక్షాయిని NEETలో ప్రతిభ కనబరిచి MBBS సీటు సాధించింది.
గురువారం సాయంత్రం వెలువడిన MBBS సీట్ అలాట్మెంట్లో దాక్షాయినికి వరంగల్లోని కాలోజీ నారాయణరావు మెడికల్ కాలేజీలో MBBS సీటు లభించింది. NEETలో ఆమె 505 మార్కులు సాధించి 83,006 ర్యాంక్ సాధించింది.
తెలకపల్లి మండల కేంద్రంలోని కేకే రెడ్డి పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన దాక్షాయిని చిన్నప్పటి నుంచి చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది. వ్యవసాయ పనులపై ఆధారపడే కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ కష్టపడి చదివి తన డాక్టర్ కావాలనే లక్ష్యం వైపు తొలి అడుగు వేసింది.
దాక్షాయిని సాధించిన విజయం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పేద కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు ఆమె విజయం స్ఫూర్తిదాయకమని గ్రామస్తులు పేర్కొన్నారు.
భవిష్యత్తులో వైద్య రంగంలో మరింత ఉన్నతంగా ఎదిగి, గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు ఆకాంక్షించారు. MBBS సీటు సాధించిన దాక్షాయినిని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు అభినందించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

