రాజేష్, తొలి కిరణం ప్రతినిధి, హైదరాబాద్:
శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇజ్జత్ నగర్ కాలనీలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉట్టి కొట్టే ఉత్సవం, అన్నదాన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. కాలనీ అంతా కృష్ణనామ స్మరణతో మార్మోగగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యాదవ సంఘం రాష్ట్ర కమిటీ చైర్మన్ రఘునాథ్ యాదవ్, స్థానిక నాయకుడు మహిపాల్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లోక రక్షణ కోసం, అధర్మాన్ని అంతమొందించి ధర్మాన్ని ప్రతిష్ఠించేందుకు శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించారని పేర్కొన్నారు. భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు అందించిన బోధనలు నేటికీ మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. యాదవ సమాజం సేవా గుణం, ఐక్యతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని, సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.
అనంతరం యువత ఉత్సాహంగా పాల్గొన్న ఉట్టి ఉత్సవాన్ని రఘునాథ్ యాదవ్, మహిపాల్ యాదవ్ ప్రారంభించారు. ఉట్టి కొట్టేందుకు యువకులు పోటీపడటంతో అక్కడ సందడి నెలకొంది. ఉట్టి ఉత్సవంలో పాల్గొన్న యువకులను ముఖ్య అతిథులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఇజ్జత్ నగర్ కాలనీ కమిటీ సభ్యులు, యాదవ సంఘం ముఖ్య నాయకులు, మహిళలు, యువత, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


