పాలెం, సెప్టెంబర్ 4: పాలెం గ్రామానికి చెందిన భరత కొండమ్మ, బాలయ్య దంపతుల తృతీయ పుత్రుడు వెంకటేష్ భరత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (HCU)లో పీహెచ్‌డీ వైవాను విజయవంతంగా పూర్తి చేశారు. “పాలమూరు జిల్లా కథలు–సాహిత్యం–సామాజిక అంశాల విశ్లేషణ” అనే అంశంపై ప్రొఫెసర్ పిల్లమర్రి రాములు గారి ఆధ్వర్యంలో ఆయన పరిశోధన చేపట్టారు.
2005 నుంచి 2016 వరకు దశాబ్ద కాలంలో పాలమూరు జిల్లాలో చోటుచేసుకున్న వివిధ సామాజిక, సాంస్కృతిక, ప్రాంతీయ అంశాలపై కవులు, రచయితలు రాసిన కథలను వెంకటేష్ భరత తన పరిశోధనలో విశ్లేషించారు. ఈ క్రమంలో సుమారు 350కుపైగా కథలను సేకరించడంతో పాటు, 40 మందికిపైగా కవులు, రచయితలను ప్రత్యక్షంగా కలిసి సమాచారం సేకరించారు. సుమారు 25 కథా సంపుటాలను పరిశీలించి పరిశోధనను పూర్తి చేశారు.
వెంకటేష్ భరత ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసంలో భాగంగా తోటపల్లి సుబ్రహ్మణ్యం హైస్కూల్లో చదువుకున్నారు. అనంతరం శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ ఓరియంటల్ కళాశాలలో బీఏ (ఎల్) విద్యను అభ్యసించారు. ఉన్నత విద్యను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో కొనసాగించి అక్కడే పీజీ, ఎం.ఫిల్ పూర్తి చేశారు. అనంతరం అదే విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారు.
వెంకటేష్ భరత పీహెచ్‌డీ వైవాను విజయవంతంగా పూర్తి చేయడంతో ప్రొఫెసర్ పిల్లమర్రి రాములు, మిత్రులు, సాహితీవేత్తలు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు చేపట్టి పాలమూరు జిల్లా సాహిత్య ఖ్యాతిని నాలుగు వైపులా చాటిచెప్పాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఆయనతోటి మిత్రులు మహేశ్వర్ జీ, డాక్టర్ గోపాల్, రాధాకృష్ణ, మల్లేష్, సంతోష్ తదితరులు వెంకటేష్ భరతను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.


