విశాఖపట్నం: రాష్ట్ర సమగ్ర అభివృద్ధి పేరుతో అమరావతి రాజధాని అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం.. ఉత్తరాంధ్రలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతిలో మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు, లైబ్రరీలు, కన్వెన్షన్ సెంటర్ల వంటి పలు అభివృద్ధి పనులకు వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతున్న సమయంలో.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమరావతికి పెద్దపీట.. ఉత్తరాంధ్రకు నిర్లక్ష్యం
రాజధాని అభివృద్ధిపై ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధలో కనీసం పదో వంతు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలపై చూపడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అమరావతిలో రోడ్లు, రవాణా, తాగునీరు వంటి మౌలిక వసతులకు భారీగా నిధులు కేటాయిస్తుండగా.. ఉత్తరాంధ్రలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, పరిశ్రమలు, రహదారులు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులు ఇంకా ప్రతిపాదనలు, సర్వేల దశలోనే ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
వెనుకబడిన ప్రాంతాల సమస్యలు ఎప్పటికి పరిష్కారం?
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలోని అనేక గ్రామాలు ఇప్పటికీ సరైన రవాణా, వైద్య సదుపాయాలు, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాయి. పలాస, కొత్తూరు, రాజాం, సీతంపేటతో పాటు గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.
ఏళ్ల తరబడి రైల్వే లైన్లు, మెరుగైన రహదారులు, వైద్య సదుపాయాలు, పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నా.. సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడం లేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.
సర్వేలు.. చర్చలకే పరిమితమైన రైల్వే ప్రాజెక్టులు
రాజాం–కొత్తూరు–పలాస రైల్వే లైన్ వంటి కీలక ప్రాజెక్టుల విషయంలో ఏళ్లుగా సర్వేలు, ప్రతిపాదనలు, చర్చలు కొనసాగుతున్నప్పటికీ కార్యరూపం దాల్చడం లేదనే విమర్శలు ఉన్నాయి. వివిధ ప్రభుత్వాల హయాంలో ఈ ప్రాజెక్టులపై ప్రస్తావనలు వచ్చినప్పటికీ.. ఇప్పటికీ ప్రజలకు పూర్తి స్థాయి రైల్వే సదుపాయం అందుబాటులోకి రాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు అమరావతిలో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు వేగంగా భూసేకరణ, నిధుల కేటాయింపులు జరుగుతున్న తీరుతో పోల్చితే ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వాల వైఖరి భిన్నంగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సమాన అభివృద్ధే రాష్ట్ర ప్రగతికి మార్గం
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి అంటే ఒక ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేయడం కాదని పలువురు పేర్కొంటున్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి, తగినన్ని నిధులు కేటాయించడంతో పాటు రైల్వే, రహదారులు, సాగునీరు, వైద్యం, విద్య, పరిశ్రమలు వంటి రంగాల్లో పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అమరావతి అభివృద్ధికి స్వాగతమే.. అదే సమయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ వంటి వెనుకబడిన ప్రాంతాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చినప్పుడే రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు తొలగి సమతుల్య అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


