తిరుపతి జిల్లా, మాధవ నగర్:
మాధవ నగర్‌లోని సెవెన్ హిల్స్ స్కూల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని పాఠశాల చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణలో ముస్తాబై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్నారుల బుడిబుడి నడకలు, అందమైన వేషధారణలు, వివిధ నృత్య ప్రదర్శనలు తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
శ్రీకృష్ణుడి బాల్య లీలలను ప్రతిబింబించేలా చిన్నారులతో వెన్న ముద్ద దొంగతనం, గోపికలతో కృష్ణుడి ఆటపాటలను ప్రదర్శింపజేశారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది.
చదువుతో పాటు విద్యార్థుల్లో సాంస్కృతిక, కళాత్మక ప్రతిభను వెలికితీయడంతో పాటు భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి, భక్తి భావాలను చిన్నతనం నుంచే పెంపొందించే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని తల్లిదండ్రులు తెలిపారు.
ఈ సందర్భంగా మాధవ నగర్‌కు చెందిన సోమశేఖర్–ప్రీతి దంపతుల కుమారుడు దీప్ కుమార్ కృష్ణుడి వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నాడు. చిన్నారి అందమైన వేషధారణ, హావభావాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇలాంటి కార్యక్రమాల్లో తమ పిల్లలను భాగస్వాములను చేయడం ఎంతో ఆనందంగా ఉందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. రాబోయే భావితరాలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, భక్తి మార్గాలపై అవగాహన కల్పించేందుకు పాఠశాల యాజమాన్యం చేస్తున్న కృషిని వారు అభినందించారు. విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తల్లిదండ్రులు పేర్కొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


