వనపర్తి, సెప్టెంబర్ 3:
నాలుగైదు జిల్లాల ప్రజల రాకపోకలకు కీలక కేంద్రంగా ఉన్న వనపర్తి పాత బస్టాండ్ అభివృద్ధికి నోచుకోకపోవడంపై అఖిలపక్ష ఐక్యవేదిక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జేఏసీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పాత బస్టాండ్‌ను నాయకులు పరిశీలించి, అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించడంతో పాటు ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డా. సతీష్ యాదవ్ మాట్లాడుతూ.. నియోజకవర్గానికి వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చామని చెబుతున్న నాయకులు.. ప్రజలకు అత్యవసరమైన పాత బస్టాండ్ అభివృద్ధికి కేవలం రూ.2 కోట్లతో ఆధునీకరణ పనులు చేపట్టలేరా? అని ప్రశ్నించారు. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వినియోగించే బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం బాధాకరమన్నారు.
పాత బస్టాండ్‌లో తాగునీరు, మరుగుదొడ్లు, ప్రయాణికులకు నిలువ నీడ వంటి ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎండ, వానతో పాటు దుమ్ము, ధూళిలో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్టాండ్‌లో సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వాహనాల పార్కింగ్ స్థలంగా మారిపోయిందని విమర్శించారు.
ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను రాజకీయాలు, విమర్శలు, ఆరోపణలకు అతీతంగా చేపట్టాలని డా. సతీష్ యాదవ్ సూచించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పాత బస్టాండ్‌ను వెంటనే ఆధునీకరించి, ప్రయాణికులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
నెల రోజుల్లోగా పాత బస్టాండ్ అభివృద్ధి పనులు ప్రారంభించకపోతే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డా. సతీష్ యాదవ్, డీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ మహారాజ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జేఏసీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు కొత్త గొల్ల శంకర్, రాజనగరం రామస్వామి, మధు, ఎల్లయ్య, సూర్య ప్రకాష్, గంధం రవి, చందు యాదవ్, ఆంజనేయులు, శివకుమార్, శాంతయ్య, ఈ. రవి, రమేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


