హైదరాబాద్, సెప్టెంబర్ 2:
తెలంగాణలో అమలవుతున్న ప్రతిష్టాత్మక కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ రెండు పథకాల అమలుపై సింగిల్ జడ్జి విధించిన మధ్యంతర స్టే ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఎత్తివేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాల అమలు కొనసాగించేందుకు మార్గం సుగమమైంది.
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు సంబంధించి 2014 నుంచి ప్రభుత్వం జారీ చేసిన ఎనిమిది జీవోలను సవాలు చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతో సింగిల్ జడ్జి పథకాల అమలుపై మధ్యంతర స్టే విధించారు.
సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్నది.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు 2014 నుంచి నిరంతరాయంగా అమలవుతున్నాయని కోర్టుకు వివరించారు. పిటిషనర్ ఈ పథకాల లబ్ధిదారుడు కాదని, ఆయనకు వ్యక్తిగతంగా ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు.
అదేవిధంగా ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదని, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన అంశాలపై దాఖలైన ఇలాంటి వ్యాజ్యాలను డివిజన్ బెంచ్ మాత్రమే విచారించాల్సి ఉంటుందని ఏజీ వాదించారు. షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలకు సుప్రీంకోర్టు గతంలో అనుమతి ఇచ్చిన విషయాన్ని కూడా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
ప్రభుత్వం తరఫు వాదనలతో ఏకీభవించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్.. సింగిల్ జడ్జి విధించిన మధ్యంతర స్టేను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టు తాజా నిర్ణయంతో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు ఉన్న అడ్డంకి తొలగిపోయింది. దీంతో అర్హులైన లబ్ధిదారులకు ఈ పథకాల ప్రయోజనాలు అందే ప్రక్రియ కొనసాగేందుకు మార్గం ఏర్పడింది.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


