మల్కాజ్గిరి, సెప్టెంబర్ 2:
బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తప్పుడు కేసులు నమోదు చేయకుండా చూడాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. ఈ మేరకు మల్కాజ్గిరి కమిషనర్ ఆఫ్ పోలీస్ సుమతి ఐపీఎస్‌ను ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు అతీతంగా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. ఎలాంటి ఆధారాలు లేకుండా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. చట్టాన్ని రాజకీయ కక్ష సాధింపు సాధనంగా మార్చకుండా, ప్రతి అంశాన్ని వాస్తవాల ఆధారంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలోనూ వాస్తవ పరిస్థితులను సమగ్రంగా పరిశీలించాలని ఎమ్మెల్యే కోరారు. కేసుల నమోదులో చట్టపరమైన నిబంధనలు, ఆధారాలు, వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని నిష్పక్షపాతంగా చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థపై అన్ని వర్గాల ప్రజలకు నమ్మకం ఉండేలా అధికారులు వ్యవహరించాలని మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా చట్టబద్ధంగా, పారదర్శకంగా వ్యవహరించేలా పోలీసు అధికారులకు సూచనలు ఇవ్వాలని సీపీని కోరారు.
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తిపై సీపీ సుమతి ఐపీఎస్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. సంబంధిత అంశాలను పరిశీలిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు జేఏసీ వెంకన్న, హేమంత్ పటేల్, గౌస్ ఇమ్రాన్, బంటి, మాశెట్టి అనిల్, నర్సింగ్ రావు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.


