వనపర్తి, సెప్టెంబర్ 2:
ఓటర్ల జాబితా సవరణ పేరుతో సామాన్య ప్రజలకు నోటీసులు జారీ చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు ప్రజలకు పూర్తి స్పష్టత ఇవ్వాలని వనపర్తి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్ కోరారు. బుధవారం వనపర్తి పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగిపోకుండా ఎన్నికల అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
నోటీసులు అందుకున్న ఓటర్లకు ఎందుకు నోటీసులు ఇచ్చారు? ఏ పత్రాలు సమర్పించాలి? ఎక్కడ సమర్పించాలి? సమర్పించేందుకు గడువు ఎంత? అనే అంశాలపై అధికారులు స్పష్టమైన సమాచారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు నెలకొనకుండా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
వృద్ధులు, నిరక్షరాస్యులు, పేదలు, దూర ప్రాంతాల్లో నివసించే ఓటర్లు నోటీసులకు సంబంధించిన ప్రక్రియలో ఇబ్బందులు పడకుండా ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానం, గడువులు వంటి వివరాలను అందరికీ అందుబాటులో ఉంచాలని తెలిపారు.
ఏ ఓటును తొలగించే ముందు సంబంధిత ఓటరుకు పూర్తి సమాచారం ఇచ్చి, విచారణ నిర్వహించి, అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం మాత్రమే నిర్ణయం తీసుకోవాలని దయానంద్ ముదిరాజ్ అన్నారు. ఓటు హక్కు తొలగింపు లక్ష్యంగా కాకుండా ప్రతి అర్హుడి ఓటుకు రక్షణ కల్పించడమే ప్రజాస్వామ్య పరిరక్షణకు కీలకం అని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం పెంచేలా అధికారులు పారదర్శకంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నామని దయానంద్ ముదిరాజ్ తెలిపారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


